|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 04:34 PM

పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి బంధాలు మరుస్తున్నారు. కడదాకా తోడుండి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే.. కనికరం లేకుండా కడతేర్చుతున్నారు. ఇటీవల జరిగిన షిల్లాంగ్, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటనలు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.. ప్రియుడి కోసం.. కట్టుకున్న భర్తలను అతి కిరాతకంగా చంపించారు భార్యలు.. దీనికోసం పెద్ద స్కెచ్చులే వేశారు.. అయితే.. అచ్చం అలాంటి ఘటనే.. తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగుచూడటం కలకలం రేపింది. భర్తను భార్య దారుణంగా చంపిన ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భార్య.. భర్తను హత్య చేసింది.. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ప్రయత్నించగా.. భార్య ప్రవర్తనపై బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. మహబూబ్‌నగర్ జిల్లా రామకృష్ణయ్యపల్లికి చెందిన అంజిలప్పతో రాధ అనే మహిళకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. వారు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని.. ఓ నిర్మాణ సంస్థలో కూలీలుగా చేరి.. అక్కడే గుడిసెలో నివాసం ఉంటున్నారు.. ఈ క్రమంలో.. అంజిలప్ప ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని భార్య రాధ కన్నీరు మున్నీరుగా విలపించింది.. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం నారాయణపేటకు తీసుకెళ్లి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది.. అయితే.. అంజిలప్ప గొంతుపై ఉన్న మరకలను చూసి బంధువులకు అనుమానం కలిగింది. దీంతో వారు నారాయణపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు రాధను ప్రశ్నించారు.. ఆమెపై అనుమానంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆమెను విచారించగా.. ఆమె అసలు విషయం బయటకు చెప్పింది.. గత కొంతకాలంగా రాధ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. అయితే అలాంటివి వద్దని, అతనితో ఫోన్ మాట్లాడొద్దని భర్త అంజిలప్ప ఆమెను మందలించాడు. దీంతో అంజిలప్పపై కోపం పెంచుకున్న రాధ.. జూన్ 22న అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న తన భర్త గొంతును నులిమి హత్య చేసింది. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే హత్య చేసినట్లు రాధ అంగీకరించిందని.. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా ఈ ఘటనపై నారాయణ పేట పోలీసులు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాచుపల్లికి కేసును బదిలీ చేశారు. దర్యాప్తులో భర్తను రాధ హత్య చేసినట్లుగా తేలడంతో న్యాయస్థానంలో హాజరుపరిచి.. జైలుకు పంపారు.