![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 07:48 PM
భద్రాద్రి పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆలయానికి చెందిన భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిని అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనతో ఆలయ సిబ్బందికి, పురుషోత్తపట్నం గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఆక్రమణదారులు దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కబ్జాకు గురవుతున్న స్వామివారి భూములను పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా ఈవో రమాదేవి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆక్రమణదారులను నిలువరించడానికి ఆమె ప్రయత్నించగా.. వారు అమానవీయంగా ఈవో రమాదేవిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడితో ఆమె స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, ఆలయ సిబ్బంది ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భద్రాచలం రామాలయానికి చెందిన భూముల కబ్జా వ్యవహారం గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకు, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదానికి దారితీస్తోంది. ఆక్రమణదారులు స్వామివారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తుండగా.. వాటిని నిలువరించడానికి దేవాదాయ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. సిబ్బంది ప్రయత్నాలకు ఆక్రమణదారుల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, దౌర్జన్యాలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.
ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. దేవాలయ భూములను పరిరక్షించడం కేవలం ఆలయ అధికారులు, సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు, ప్రభుత్వ బాధ్యత కూడా. ఇలాంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి. దేవాలయ భూముల రక్షణకు పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది.