|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 01:22 PM

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల క్రితం స్వల్ప అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స పూర్తయిన అనంతరం నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే ఉండనున్నారు. ఆ తర్వాత ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు సైతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయన త్వరగా కోలుకుని డిశ్చార్జ్ కావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి తాజా అప్‌డేట్స్‌ను బీఆర్ఎస్ నాయకులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.