|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 04:42 PM

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా.. హైదరాబాద్ లోని లక్డీకాపూల్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలానే ఆ విగ్రహానికి పూలమాల వేసి గౌరవనివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఇంకా మాజీ సీఎంకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కలిసి రోశయ్య రాజకీయ జీవితాన్ని, ప్రజాసేవను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య విధేయత, అహంకార శూన్యత, ప్రజల పట్ల నిబద్ధత ఈ తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఆయన వంటి నేతలను యువ రాజకీయ నేతలు స్పూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రోశయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ మరువలేనిది అని కొనియాడారు. రాజకీయాల్లో సున్నితమైన మార్గాన్ని అనుసరించి అందరితో మమేకమైన గొప్ప నేత అని గుర్తుచేశారు. రాజకీయ ప్రస్థానం.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా, సభాపతిగా, ముఖ్యమంత్రిగా సహా పలు పదవుల్లో పని చేశారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి హోదాలో 15 పైగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.