![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 05:09 PM
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. వారికి అందించే ప్రమాద బీమా పథకాన్ని 2029 సంవత్సరం వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం స్త్రీ నిధి ద్వారా అమలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ ప్రమాద బీమాను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద బీమా పథకం ప్రకారం.. ఏదైనా ప్రమాదవశాత్తు SHG సభ్యులు మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 10 లక్షల బీమా పరిహారం లభిస్తుంది.
ఈ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 409 మంది కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించారు. ప్రభుత్వం అందించిన ఈ వెసులుబాటు, ఆర్థిక భద్రత కారణంగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు 1.67 లక్షల మంది కొత్త సభ్యులు ఈ బృందాల్లో చేరారు. సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రమాద బీమా పథకాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగిస్తూ కొత్త జీవోను విడుదల చేసింది.
మహిళా స్వయం సహాయక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబనకు, సామాజిక సాధికారతకు కీలకమైన వేదికలు. ఈ బృందాల ద్వారా మహిళలు చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించడంతో పాటు.. చిన్న తరహా పొదుపును ప్రోత్సహిస్తున్నారు. తద్వారా తమ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. అయితే.. అనేక సందర్భాల్లో దురదృష్టవశాత్తు జరిగే ప్రమాదాలు వారి జీవితాలను, వారి కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం పొడిగింపు ద్వారా.. భవిష్యత్తులో కూడా SHG సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇది మహిళలు మరింత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తమ ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పథకం మహిళా సాధికారతకు, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనడంలో సందేహం లేదు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు. దీని ద్వారా వారికి ఎలాంటి దురదృష్టకర సంఘటన జరిగినా.. వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోకుండా కొంతమేర రక్షణ లభిస్తుంది.