|
|
by Suryaa Desk | Sun, Aug 10, 2025, 06:08 AM
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు విషయమై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. షరతులతో కూడిన వేతనాల పెంపు ప్రతిపాదనలను నిర్మాతలు ముందుకు తెచ్చినప్పటికీ, వాటిని అంగీకరించేది లేదని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫెడరేషన్ ప్రకటించింది.శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్మాతలు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, మూడు విడతల్లో వేతనాలు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. రోజుకు రూ.2 వేల కంటే తక్కువ తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఇస్తామని, రూ.1000 కంటే తక్కువ వేతనం ఉన్నవారికి వెంటనే 20 శాతం పెంచి, మూడో ఏడాది మరో 5 శాతం పెంచుతామని చెప్పారు. అయితే, చిన్న బడ్జెట్ సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయని, నాలుగు షరతులకు ఒప్పుకుంటేనే ఈ పెంపు అమలవుతుందని నిర్మాతలు తెలిపారు.అయితే, నిర్మాతల షరతులు ఫెడరేషన్‌ను విభజించేలా, యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఫెడరేషన్ నేతలు ఆరోపించారు. 13 సంఘాలకు చెందిన రోజువారీ కార్మికులందరికీ ఒకే విధమైన వేతన పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాతల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, తమ ఆందోళనను ఆదివారం నుంచి మరింత తీవ్రతరం చేయనున్నట్లు ఫెడరేషన్ నేతలు ప్రకటించారు.