|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 04:20 PM
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు తమ దూకుడుతో ప్రయాణికులను హడలెత్తించారు. మూడు బస్సులు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ డ్రైవర్లు రహదారిపై రేసింగ్ జరిపిన ఘటన ప్రయాణికులను, ఇతర వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట-హుజురాబాద్ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. హుజురాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మూడు బస్సులు జమ్మికుంట నుండి హుజురాబాద్ వైపు వెళుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు ఒకరినొకరు అధిగమించేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. ఒక బస్సును మరో బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో రహదారిపై ప్రమాదకరంగా దూసుకెళ్లారు. ఈ పోటీలో పడి ఇతర వాహనాలకు దారివ్వకుండా, రోడ్డును దాదాపు బ్లాక్ చేస్తూ ప్రయాణించారు. ప్రభుత్వ బస్సులే ఈ విధంగా ప్రవర్తించడంతో మిగతా వాహనదారులు ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెందారు.ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి, ఇంత బాధ్యతారహితంగా బస్సులు నడపడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లే ఇలా ప్రవర్తిస్తే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను గాలికొదిలి, ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన ఆ ముగ్గురు డ్రైవర్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.