|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 07:52 PM
నిజామాబాద్ - బోధన్ మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( ఎన్‌హెచ్‌ఏఐ ) అధికారులు.. నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే పనులను ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అజయ్ మణికుమార్ తెలిపారు. ఈ రహదారి నిర్మాణం సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. సుమారు 29 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో రహదారుల అభివృద్ధి..
ఈ కొత్త రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు 350 ఎకరాల భూమిని సేకరించి, రూ.1,575 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ఈ పనులతో పాటుగా.. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే మార్గంలో అటవీ అనుమతులు రాక నిలిచిపోయిన 4.7 కిలోమీటర్ల విస్తరణ పనులను కూడా పూర్తి చేస్తారు. బోధన్ సమీపంలో.. ఎడవల్లి వద్ద ఆర్ఓబీలు (రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు), గ్రామాల్లో వీయూపీలు (వెహికల్ అండర్ పాసింగ్) నిర్మిస్తారు.
నిజామాబాద్ జిల్లాలో కేవలం బోధన్ రహదారి మాత్రమే కాకుండా ఇతర రహదారుల పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా.. ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల రోడ్డు. ఈ 132 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ.4,500 కోట్లు కేటాయించారు. దీని కోసం 1,350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ పనులు కూడా సెప్టెంబర్ నెలలోనే మొదలు పెట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మద్నూర్-బోధన్ రోడ్డు.. ఈ 39 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి పనులకు రూ.429 కోట్లు మంజూరు చేశారు. మెదక్-ఎల్లారెడ్డి-బోధన్ రహదారి.. ఎన్‌హెచ్-765లో భాగమైన ఈ నాలుగు వరుసల రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. బోధన్-బాసర-భైంసా రోడ్డు.. ఎన్‌హెచ్-161గా పిలిచే ఈ 56 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే నిజామాబాద్ జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. వీటితో పాటు.. ప్రమాదాల సంఖ్య కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.