|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 07:48 PM
మహబూబ్‌నగర్ జిల్లాను పారిశ్రామికంగా.. ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా నుంచి వలసలను అరికట్టడానికి.. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడానికి డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి.. అడ్డాకుల మండలం గుడిబండలో డ్రై పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ డ్రై పోర్టు వల్ల జిల్లా ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
డ్రై పోర్టు ఏర్పాటు, అనువైన ప్రాంతం..
గుడిబండ గ్రామంలోని సుమారు 100 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని డ్రై పోర్టు ఏర్పాటు కోసం పరిశీలిస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) అధికారులు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి ఈ స్థలాన్ని సందర్శించారు. గుడిబండ ప్రాంతం డ్రై పోర్టుకు ఎంతో అనుకూలమైనదని వారు గుర్తించారు. ఇది నేషనల్ హైవే-44కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‌తో పాటు కర్నూలు, బెంగళూరు మార్గాలకు దగ్గరగా ఉండటం దీనికి అదనపు బలం. అలాగే.. కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లే జాతీయ రహదారి-167కు సమీపంలో ఉండటంతో రవాణా చాలా సులభంగా ఉంటుంది.
డ్రై పోర్టుల వల్ల సముద్ర ఓడరేవుల నుంచి వచ్చే సరుకులను రైలు, రోడ్డు మార్గాల ద్వారా సురక్షితంగా నిల్వ చేసి, సమయానికి గమ్యస్థానాలకు చేరవేయవచ్చు. దీనివల్ల ఓడరేవుల్లో రద్దీ తగ్గుతుంది. ఖర్చు, సమయం ఆదా అవుతాయి. పాలమూరు జిల్లాలో ఇలాంటి పోర్టు వస్తే.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇప్పటికే దేవరకద్ర నియోజకవర్గంలోని చౌదర్‌పల్లి-బస్వాయిపల్లి వద్ద బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. డ్రై పోర్టు, ఇతర పరిశ్రమలు రావడం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా గణనీయంగా అభివృద్ధి చెంది.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.