|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 07:30 PM
మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌లో భాగంగా.. హైదరాబాద్‌కు పర్యాటక ఆకర్షణను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను ఇళ్లను ఖాళీ చేయాలని కోరిన తరువాత.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అధునాతన ప్రాజెక్టులతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా.. హిమాయత్ సాగర్‌లోని గాంధీ సరోవర్ వద్ద ' గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ' నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇది నగరానికి వచ్చే పర్యాటకులందరికీ స్వాగతం పలికేలా ఒక ముఖద్వారంగా ఉంటుంది.
ప్రపంచంలోనే ఎత్తైన టవర్, ఎకో థీమ్ పార్కు..
'గేట్ వే ఆఫ్ హైదరాబాద్' ప్రాజెక్ట్‌లో భాగంగా ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)కు ఒక వైపు ఎకో థీమ్ పార్కును, మరో వైపు బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్‌ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ఐకానిక్ టవర్ కోసం అవసరమైన డిజైన్‌లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా.. ఈ థీమ్ పార్కు, టవర్‌ను అనుసంధానం చేస్తూ ఒక ఎలివేటెడ్ గేట్‌వేని నిర్మించాలని చెప్పారు. ఇది విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ సరోవర్‌కు చేరుకునేలా ఒక కనెక్టివ్ కారిడార్‌గా ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.
నీటి నిర్వహణ, టెండర్ల ప్రణాళిక..
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును కేవలం పర్యాటక ఆకర్షణగానే కాకుండా, నీటి నిర్వహణకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది ఇరువైపులా అండర్ గ్రౌండ్‌లో భారీ వాటర్ స్టోరేజ్ సంప్ నిర్మించి, నీటిని నిల్వ చేసుకునేందుకు వీలు కల్పించాలని ఆదేశించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలోని తాగునీటిని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వాటర్ ఫ్లో స్టడీస్ చేసి, రెండు నెలల్లోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల వల్ల నగరంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు.. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుంది.