|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 12:45 PM
మల్కం చెరువు పరిసరాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు శుక్రవారం ఉదయం సమీక్షించారు. వరద ముంచెత్తడానికి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. చెరువుకు వచ్చే వరద పెద్దమొత్తంలో ఉండి.. బయటకు వెళ్లేది ఆ స్థాయిలో లేకపోవడంతో సమస్య తలెత్తిందని అదికారులు తెలిపారు. ప్రస్తుతం అలుగు పారడం ద్వారా మాత్రమే నీరు బయటకు వెళ్తోందని.. స్లూయిజ్ గేట్లు కూడా ఏర్పాటు చేస్తే.. వర్షాకాలంలో నీటిమట్టాన్ని తగ్గించడానికి వీలౌతోందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు వెంటనే ఈ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. చెరువు పరిసరాల్లో రహదారులే కాకుండా.. నివాసాలు కూడా నీట మునుగుతున్నాయని.. వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. చెరువులోకి వచ్చిన ఇన్లెట్ల సామర్థ్యంతో పాటు.. ఔట్లెట్ను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. బయోడైవర్సిటీ పార్కు పరిసారలతో పాటు.. షేక్పేట ప్రాంతాల నుంచి కూడా భారీ వరద వచ్చి వంతెన ఆరంభంలో నిలిచిపోతోందని.. ఈ వరదంతా మల్కం చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్యగారు. సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతిగారు, ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తదితరులు కమిషనర్తో పాటు క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నారు.