|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 12:00 PM

మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్‌లోని ఓల్డ్ అల్వాల్ గ్రామపంచాయతీలోని 60, 61, 62, 63 సర్వే నంబర్లలోని రెడ్డి ఎన్‌క్లేవ్‌లో పార్కుని హైడ్రా కాపాడింది. 16 ఎకరాలకు పైగా ఉన్న ఈ లే ఔట్‌లో 235 వరకూ ప్లాట్లున్నాయి. 30 ఏళ్ల క్రితం లేఔట్ వేసిన వారి వారసులే ఈ పార్కును కబ్జా చేసినట్టు అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాలతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు.. 2640 గజాల స్థలం పార్కుకు కేటాయించినదే అని నిర్ధారించారు. దీంతో ఆ పార్కులో కబ్జాలను తొలగించి.. పార్కు ప్రొటెక్టడ్‌బై హైడ్రా అని బోర్డును ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ ను నిర్మించారు. 2000 సంవత్సరం నుంచి ఈ పార్కు కోసం తాము పోరాడుతున్నామని.. హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో సమస్యకు పరిష్కారం దొరికిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ హైడ్రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్జతలు తెలిపారు. కాలనీలో నివాసితులందరూ పార్కుకు చేరుకుని మురిసిపోయారు.హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వారి సంబరాలకు హద్దులు లేవు.