![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:19 PM
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రీల్స్ మోజు యువత ప్రాణాలను బలిగొంటోంది. చిన్నపాటి ఆనందాల కోసం.. క్షణికావేశంలో చేసే సాహసాలు ఎందరో యువతీయువకుల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని, గుండెకోతను మిగులుస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న పసి ప్రాణాలు కూడా ఈ రీల్స్ వ్యసనానికి బలవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన ఈ ప్రమాదాన్ని మరోసారి కళ్ళకు కట్టింది.
చిట్కుల్ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి సహస్ర రీల్స్ చేయాలనే సరదాతో ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఫ్యానుకు తాడు కట్టి, దాన్ని మెడకు బిగించుకొని రీల్స్ చేస్తున్న సమయంలో అనుకోకుండా కరెంటు వచ్చింది. ఒక్కసారిగా ఫ్యాన్ వేగంగా తిరగడంతో.. తాడు సహస్ర మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. ఊపిరాడక ఆ చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘అమ్మా.. నాకు లైక్ లు రావాలి, నేను కూడా పాపులర్ అవ్వాలి’ అంటూ ముద్దుముద్దుగా అడిగిన ఆ పసికూన, నిన్నటి వరకు ఇంట్లో చిరునవ్వులు చిందించిన ఆ కన్నబిడ్డ, నేడు కదలకుండా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి ఆక్రందనలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రీల్స్ మోజులో ప్రాణాలు కోల్పోవడం సహస్ర ఒక్కదానికే పరిమితం కాదు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకంగా వెలుగు చూస్తున్నాయి.
బైకులపై, కార్ల పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ రీల్స్ తీయబోయి యువకులు మృత్యువాత పడుతున్నారు. హైవేలపై అతివేగంగా వెళుతూ, ప్రమాదకరమైన మలుపుల వద్ద విన్యాసాలు చేయబోయి నియంత్రణ కోల్పోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం. సాహసం పేరుతో ఎత్తైన భవనాల పై నుంచి, కొండల పైనుంచి దూకడం, లేదా ప్రమాదకరమైన ప్రదేశాల్లో నిలబడి సెల్ఫీలు, రీల్స్ తీసుకోవడం వల్ల జారిపడి మరణిస్తున్నారు. వీటితో పాటు.. అడవి జంతువులతో లేదా ప్రమాదకరమైన పాములతో రీల్స్ తీయబోయి వాటి దాడికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
నీటిలో దూకడం, ప్రమాదకరంగా ఈత కొట్టడం వంటివి చేస్తూ.. లోతు తెలియక లేదా ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేక నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. విద్యుత్ స్తంభాలపై, రైలు పట్టాలపై నిలబడి రీల్స్ చేయబోయి విద్యుదాఘాతానికి గురై లేదా రైలు ఢీకొని మరణించిన కేసులు కూడా ఉన్నాయి.
ఎంతో కష్టపడి పెంచి, పెద్ద చేసిన పిల్లలు.. చిన్నపాటి సరదాలకు బలవుతున్నప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ప్రభుత్వం, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఈ రీల్స్ వ్యసనంపై అవగాహన కల్పించాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇలాంటి ప్రమాదకరమైన కంటెంట్‌ను నివారించడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి హృదయ విదారక ఘటనలను నివారించగలం.