|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 04:58 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుండగానే, టికెట్ ఆశిస్తున్న ఇద్దరు కీలక నేతలకు సంబంధించిన వార్తలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. బరిలో ఉంటారని భావించిన ముఖ్య నేతల్లో ఒకరు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా, మరొకరు క్రిమినల్ కేసులో చిక్కుకున్నారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. అయితే, తాను అభ్యర్థిత్వ రేసులో లేనని ఆయన స్పష్టం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను టికెట్ కోసం ఎవరినీ అడగలేదని, పార్టీ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపినా వారి గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తానని ఆయన తెలిపారు. పార్టీ సిఫారసు చేసిన జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఒకవైపు బొంతు రామ్మోహన్ ఇలా ప్రకటించగా, మరోవైపు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 4న యూసుఫ్‌గూడలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటరు కార్డులను పంపిణీ చేశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు సోమవారం నవీన్ యాదవ్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్లు 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు.