|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 07:06 PM
తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తేదీ రానే వచ్చింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తలెత్తిన ఈ బైపోల్స్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్యను పోటీలో ఉంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక అధికార కాంగ్రెస్ సహా బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ.. ఈ సీటులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో లేనట్లు జీహెచ్ఎంసీ మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ సీటు నవీన్ యాదవ్‌కే కన్ఫర్మ్ అవుతోందంటూ హస్తం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో మంగళవారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్ యాదవ్ వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ రేసులో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ జూబ్లీహిల్స్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాను పనిచేస్తానని ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ ప్రకటించడంతో లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.
మరోవైపు.. ఇదే జూమ్ మీటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్.. ఏఐసీసీ సెక్రటరీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌పై చేసిన సర్వే రిపోర్టులు, అభ్యర్థుల సామాజిక అంశాలపై ఈ సమావేశంలో నేతలు కూలంకషంగా చర్చించారు.
అయితే.. రెండు పేర్లతో ఏఐసీసీకి సిఫారసు చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్‌కే దక్కితుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను వచ్చే నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది. దీంతో వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించి.. పూర్తి స్థాయి ప్రచార రంగంలోకి దిగాలని అధికార హస్తం పార్టీ భావిస్తోంది.