|
|
by Suryaa Desk | Sun, Oct 05, 2025, 06:53 PM
డిజిటల్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి, ముఖ్యంగా మహిళలు ఆన్‌లైన్ వేదికలపై వ్యక్తిగత ఫోటోలు, సున్నితమైన సమాచారాన్ని పంచుకునే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో పొంచి ఉన్న ముప్పు గురించి వివరిస్తూ, మహిళలు మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ఆయన కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) కనెక్ట్ 2025 కార్యక్రమంలో భాగంగా ఆయన మహిళా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఇటీవలే నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఈ వేదికగా మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ విషయంపై ఆయన పోస్ట్ చేశారు. “చాలామంది మహిళలు తమ ప్రైవేట్ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను ఆన్‌లైన్‌లో పంచుకుంటున్నారు. కానీ వాటిని దుండగులు సులభంగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. నకిలీ గుర్తింపులతో పరిచయం చేసుకొని, నమ్మించి మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.