|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 07:41 PM
టెక్నాలజీ సాయంతో పూర్తిగా శరీరం పక్షవాతానికి గురైన వారికి సహాయం అందించే పరికరాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు. ఈ నూతన ఆవిష్కరణ పక్షవాత రోగులకు స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పరికరం సహాయంతో రోగులు తమ వీల్‌చైర్‌ను నియంత్రించడం, అర్జెంట్‌గా ఎదైనా అవసరం అయితే అభ్యర్థించడం, ఇంట్లోని విద్యుత్ పరికరాలను కూడా ఆపరేట్ చేయడం సాధ్యమవుతుంది.
బయోమెడికల్ ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్న ఈ విద్యార్థులు రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌కు 'పక్షవాత రోగుల కోసం ఇంటిగ్రేటెడ్ సహాయక సాంకేతిక వ్యవస్థ అని పేరు పెట్టారు. ఈ ఆవిష్కరణ 'హాక్-ఎ-బోర్డ్ హ్యాకథాన్' ఫైనల్‌లో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ పరికరం పని చేయడానికి ముఖ్యంగా మూడు టెక్నాలజీలను ఉపయోగించారు. ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్ వినియోగదారు ముఖ కదలికలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ .. దీని ద్వారా ఇంటిలోని స్విచ్‌లు వంటి వాటిని నియంత్రించవచ్చు. బాహ్యంగా జత చేసిన స్క్రీన్.. ఆదేశాలను వీక్షించడానికి ఉపయోగపడుతుంది.
ఈ బృందంలోని హారిక అనే విద్యార్థి మాట్లాడుతూ.. మెడ కింది భాగం నుండి కండరాల కదలికను కోల్పోయిన రోగులు కుటుంబ సభ్యులపై పూర్తిగా ఆధారపడటం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. అలాంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్పత్తిని రూపొందించినట్లు, దీనిని ఏ వీల్‌చైర్‌కు లేదా బెడ్‌కు అయినా జత చేయవచ్చని వివరించారు.
సిస్టమ్ పనిచేసే విధానం ఇలా..
వినియోగదారు ముక్కు కొన స్థానాన్ని ట్రాక్ చేయడం ద్వారా వివిధ పనులు చేస్తుంది. వీల్‌చైర్‌కు జతచేసిన స్క్రీన్ ముందు వినియోగదారు ముఖాన్ని లేదా తలను కదిలించి.. ఒక నిర్ణీత స్థానంలో మూడు సెకన్ల పాటు ఆపితే.. యాక్షన్ ఎంపిక అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ముందుగా నమోదు చేసుకున్న కొన్ని నంబర్‌లకు కాల్ చేసి సహాయం కోరడానికి కూడా ఇది అవకాశం ఇస్తుంది. దీనివల్ల ఇతరులపై ఆధారపడటం తగ్గుతుంది.
ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన మరో విద్యార్థి వెంకట జైదీప్ దత్తా మాట్లాడుతూ.. ఈ వ్యవస్థను ప్రాథమిక శిక్షణతో కూడా ఆపరేట్ చేయవచ్చని.. ఇది అందుబాటులో, చౌకగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఖరీదైన ఉత్పత్తులకు ఇది తక్కువ ధరకే అంటే.. సుమారు రూ.8,000 నుండి రూ.10,000 మధ్య ఉంటుందన్నారు. ముఖ్యంగా.. మాట్లాడలేని (Speech disability) వారికి కూడా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారం, నీరు కావాలని కోరడం లేదా రెస్ట్ రూమ్‌కి వెళ్ళడానికి సహాయం అడగడం వంటి ప్రాథమిక అవసరాలకు దీనిని వినియోగించుకోవచ్చు. ఈ వ్యవస్థ ఇంగ్లీషుతో పాటు తొమ్మిది భారతీయ భాషలలో సమాచార మార్పిడికి సపోర్ట్ చేస్తుందన్నారు.