|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 07:26 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో.. ఆ విజయావకాశాలను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని.. దీనిలో భాగంగానే బీఆర్‌ఎస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య రహస్య ఒప్పందం కుదిరినట్లు ఆమె ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నందున.. కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం పేరుతో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ తెర వెనుక అసలు కుట్ర వేరే ఉందని విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈ ఉపఎన్నికలో ఒక డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపి.. తన రహస్య మిత్రపక్షమైన బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తోందని ఆమె ఆరోపించారు.
పైకి బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించినప్పటికీ.. రహస్యంగా తమ కార్యకర్తలు బీఆర్‌ఎస్ గెలుపు కోసం పని చేయాలని సందేశం పంపినట్లు వార్తలు వస్తున్నాయని విజయశాంతి తెలిపారు. ఎలాగో కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి, ఆ విజయావకాశాలను దెబ్బ కొట్టాలనే కుట్రతోనే.. టీడీపీ మద్దతు బీఆర్‌ఎస్‌కు లభించే విధంగా బీజేపీ రహస్య అవగాహన కుదుర్చుకుందని విమర్శించారు.
ఈ సందర్భంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు అవగాహన కుదుర్చుకుంటున్న బీఆర్‌ఎస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మూడు పార్టీల అనైతిక కుట్రను ఛేదించి.. కాంగ్రెస్ విజయాన్ని సుస్థిరం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
కాగా, మాగంటి గోపినాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ తరపున మాగంటి భార్య సునీత బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ రెడీ అయింది. ఇక బీజీపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండగా.. బలమైన క్యాండిడేట్ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్థానానికి నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న ఫలితం వెల్లడి కానుంది.