|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 07:11 PM
తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వ నిర్ణయం మేరకు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది. దీని వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గతంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా ఉంది. ఇదిలా ఉంచితే.. ఆడవారికి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోన్న సంస్థ.. మిగతా ప్రయాణికులకు మాత్రం వరుస షాకులిస్తోంది. గతంలో ఒకసారి టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ తాజాగా అక్టోబర్ 6 నుంచి నగర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అలానే పండగల వేళ రద్దీని దౄృష్టిలో పెట్టుకుని.. టికెట్ ధరలను సగం పెంచుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆర్టీసీ మరోసారి టికెట్ రేట్లను పెంచడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని నియంత్రించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నగరం అంతటా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని నిర్ణయించింది. రానున్న మూడు సంవత్సరాల్లో నగరం అంతటా 2800 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే నగరం అంతటా 265 ఈవీ బస్సులు తిరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో 275 బస్సులు నగరానికి రానున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లు, వాటిని ఛార్జ్ చేయడానికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, డిపోలకు హైటెన్షన్ విద్యుత్ లైన్లను అనుసంధానం చేయడానికి అవసరమైన వ్యయం గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అయితే ఈవీలు, వాటికి తగ్గట్టుగా ఛార్జింగ్ స్టేషన్ల వంటి వాటి కోసం ఆర్టీసీపై వేల కోట్ల రూపాయల భారం పడనున్నది.
ఈక్రమంలో ఈ భారాన్ని భరించేందుకు.. టికెట్ రేట్లను పెంచి.. ప్రయాణికుల నుంచి వసూలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధం అవుతోంది. టికెట్లపై కనిష్టంగా రూ.5 నుంచి అత్యధికంగా రూ.10 వరకు గ్రీన్ ఫీ వసూలు చేయాలని ఆర్టీసీ భావిస్తున్నది. టికెట్ల పెంపు ద్వారా రానున్న రెండు సంవత్సరాల్లో.. సుమారు రూ.220 కోట్లు సమకూరుతాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. అయితే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ మొత్తం భారంలో అధిక భాగం ప్రభుత్వం మీదనే పడనుంది.
ఛార్జింగ్ స్టేషన్లు, హైటెన్షన్ విద్యుత్తు లైన్ల ఏర్పాటు కోసం ఒక్కొ డిపోకు రూ.10 కోట్ల చొప్పున మొత్తం అన్ని డిపోలకుగాను ఆర్టీసీపై దాదాపు రూ.392 కోట్ల అదనపు భారం పడనున్నది. ప్రభుత్వం ఈ భారాన్ని సైతం లెక్క చేయక ఈవీ బస్సుల వినియోగానికే తన ఓటు వేస్తుంది. ఆర్టీసీ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం నడుస్తోన్న డీజిల్ బస్సుల ద్వారా నిత్యం 600 టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయని వెల్లడిస్తున్నారు. ఈ డీజిల్ బస్సులు తొలగిస్తేనే పర్యావరణాన్ని కాపాడుకోగలం అంటున్నారు.