![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 12:41 PM
వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 వద్ద చింతలబస్తీ ఆరంభంలో ఉండే కల్వర్టును పరిశీలించారు. ఈ కల్వర్టు 12 మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. చింతలబస్తీ వైపు కబ్జాలను తొలగించిన విషయం విధితమే. 6 మీటర్ల మేర కబ్జాకు గురి అవ్వడంతో కల్వర్టు కింద భారీగా చెత్తపోగై వరద సాగడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది. అక్కడ చెత్తను తొలగించడానికి లాంగ్ ఆర్మ్ జేసీబీని వినియోగించిన తీరును పరిశీలించారు. ఇదే మాదిరి నగరంలోని ప్రధాన కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. అంతకు ముందు కృష్ణ నగర్లో నాలాల తీరును క్షేత్రస్థాయిలో7 పరిశీలించారు. వరద ముంచెత్తడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నివారణకు ఇటీవల కొత్తగా 3 మీటర్ల వెడల్పుతో నిర్మించిన వరద కాలువ మధ్యలో ఎందుకు ఆగిపోయిందో విచారించారు. కృష్ణానగర్ ప్రధాన దారిని దాటించడానికి ఉన్న అవరోధాలపై వాకబు చేశారు. పై నుంచి ఎంత వెడల్పుతో వస్తుందో అంతే స్థాయిలో బాక్సు డ్రైన్లను కాని.. పైపులను ఒకటి రెండో రోజుల్లో అమర్చి రాకపోకలను పునరుద్ధరించేలా పనులు చేపట్టాల్సిన ఆవశ్యకతను చర్చించారు. సంబంధిత శాఖలన్నిటితో సమావేశమై దీనిపై చర్చించాలని సూచించారు.