|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:57 PM

కాంగ్రెస్ ఏం ఉద్దరించిందని 'సామాజిక న్యాయ సమర భేరీ' సభను నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అర్ధశతాబ్దానికిపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లలో ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చేయలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలను కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, మరి ఏ ముఖం పెట్టుకుని సభను నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని, లేకుంటే ఆ సభకు 'సామాజిక అన్యాయ సమర భేరీ' అని పేరు మార్చుకోవాలని సూచించారు. జనాభాలో సగమున్న బీసీలకు కేబినెట్ లో ఎన్ని మంత్రి పదవులిచ్చారు? అని ప్రశ్నించారు.ఇవాళ వేములవాడ నియోజకవర్గం మరిమడ్ల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. (Ponnam Prabhakar) పొన్నం ప్రభాకర్‌కు మంత్రి పదవిస్తే బీసీల గొంతు విన్పిస్తున్నారని, మరింత బీసీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేనేలేదని మండిపడ్డారు. యూరియా కొరతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే కేంద్రాన్ని బదనాం చేస్తున్నాయని మండిపడ్డారు. అడిగిన దానికంటే అదనంగా యూరియా ఇచ్చినా కేంద్రాన్ని బదనాం చేస్తారా? అని ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తుంటే ఓర్వలేకే యూరియా కొరత పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అధికారులు తప్పు దోవ పట్టిస్తున్నారని, అదనపు యూరియా ఇచ్చే విషయాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా 20 వేలకుపైగా గిరిజన జనాభా ఉన్న మండలాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 728 స్కూల్స్ లక్ష్యం కాగా, దాదాపు 500 స్కూల్స్ ప్రారంభమైనట్లు వెల్లడించారు. అందులో 1.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వివరించారు. సమాజంలో పూర్తిగా వెనుకబడిన ఆదివాసీ, గిరిజనులకు నవోదయ స్థాయిలో విద్యను అందించడం ద్వారా సమాజంలోని అసమానతలు తొలగించి విద్యలో సమానత్వం సాధించాలన్నదే ఈ ఏకలవ్య స్కూల్స్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.