![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 10:42 PM
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని. అవి చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవని.. కర్రు కాల్చి వాతలు పెట్టాలన్నారు. ఆ విధంగా మీరందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశామని కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది నోరా లేకుంటే మోరీనా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రుణ మాఫీ లేదు రైతు బంధు లేదంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని. అందుకే వందనా నీ బొందనా అని తాను స్పందించానని కేటీఆర్ చెప్పారు. ఇది కోతల ప్రభుత్వమంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభివర్ణించారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నారంటేనే.. అందుకు కేసీఆరే కారణమన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే.. గులాబీ జెండా ఎగరకుంటే.. తెలంగాణ వస్తుండేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు తాము సైతం అధికారంలో ఉన్నామన్నారు. కానీ తాము ఈ విధంగా ఎగిరెగిరి పడలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఆరాచకాలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. మంత్రి సీతక్క అనుచరుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ చేస్తున్న శాంతియుత ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు.
పోలీస్ యాక్ట్ పేరుతో బీఆర్ఎస్ శాంతియుత నిరసనను అడ్డుకున్న ములుగు పోలీసులు, కాంగ్రెస్ నేతల పర్యటనకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఆ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారన్న సంగతి అర్థం అవుతుందని కేటీఆర్ అన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాలపై దొంగల లెక్క విరుచుకుపడ్డ పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏం పోలీసింగ్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎవరి ఆదేశాల మేరకు దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరి 2 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారో ములుగు పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కొంతమంది పోలీసులకు న్యాయస్థానాల్లో చివాట్లు పడుతున్నా ఇంకా సోయి రావడం లేదన్ని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.