![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:57 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడంతో పాటు కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో సోలార్ విద్యుత్ అమర్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ గ్రామాల్లోని అన్ని ఇళ్లపై, వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్లు అమర్చనున్నారు. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,273 కోట్లు ఖర్చు చేయనుంది. తెలంగాణలోని ఆ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ గ్రామాల్లో పూర్తిగా సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తొలి విడతగా 81 గ్రామాలకు రూ. రూ. 1,273 కోట్లు ఖర్చు చేసి పూర్తి సౌర విద్యుత్ గ్రామాలుగా మార్చేందుకు ఈ మేరకు రెడ్కో టెండర్లు పిలిచింది. 81 గ్రామాల్లోని అన్ని ఇళ్లు, వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్లు అమర్చనున్నారు. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా సౌర విద్యుత్ ను సమృద్ధిగా వినియోగించుకోవచ్చు మిగిలిన సౌర విద్యుత్ గ్రిడ్ కు సరఫరా అవుతుంది. అలాగే వ్యవసాయ బోర్లకూ సోలార్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆ కరెంట్ ను బోరుకు వినియోగించుకోవచ్చు. మిగిలిన సోలార్ కరెంట్ గ్రిడ్ కు సరఫరా అవుతుంది. సోలార్ విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినందుకు రైతుకు ఒక యూనిట్ కు రూ. 3.13 చొప్పున డిస్కం సంస్థలు చెల్లిస్తాయి. దీంతో రైతులు పంటల ద్వారానే కాకుండా అదనంగా కూడా సంపాదించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 81 గ్రామాల్లోని 16,840 వ్యవసాయ బోర్లు, 40,349 ఇళ్లకు సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌కు మొత్తం రూ. 1,273 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సోలార్ ప్లేట్స్ ఏర్పాటుకు రెడ్కో టెండర్లను ఆహ్వానించింది. అయితే మొత్తం వ్యయంలో రూ. 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందించనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ మేరకు జూలై 24లోగా టెండర్లను దాఖలు చేయాలని రెడ్కో సూచనలు చేసింది.ఒక్కో ఇంటికి 2 కిలోవాట్ల సోలార్ ప్లేట్స్ అమర్చనున్నారు. ఇలా 81 గ్రామాల్లోని 40,349 ఇళ్లకు 80,698 కిలో వాట్ల సోలార్ ప్లేట్స్ అవసరం ఉన్నాయని రెడ్కో పేర్కొంది. ఈ విధానం సక్సెస్ అయితే గ్రామాల్లోని ప్రజలపై కరెంట్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.