![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 07:34 PM
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. తాజాగా మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరో 30 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు భట్టి స్పష్టం చేశారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు. ప్రతి పాఠశాలను 25 ఎకరాల్లో.. రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని వివరించారు. మొదటి సంవత్సరం 58 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11,600 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతేకాకుండా రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని కూడా భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఉగాది పండగ నుంచి తెలంగాణ ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మంది పేదలకు సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రతి సంవత్సరం సన్న బియ్యం కోసం రూ.13,525 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. తెలంగాణలోని సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇందుకుగాను తాజాగా బడ్జెట్‌లో రూ.23,373 కోట్లు కేటాయించమని లెక్కలతో సహా వివరించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అంటే వ్యవసాయం అని.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.9 వేల కోట్లు వేశామని స్పష్టం చేశారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ రూపంలో ఇప్పటివరకు రూ.1,199 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. రైతు బీమా పథకం కింద 42.16 లక్షల మంది రైతులకు బీమా అందించినట్లు చెప్పారు.
ఇక రాష్ట్రంలో రూ.22 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టినట్లు భట్టి తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు వైద్య సహాయం చేస్తున్నామని.. 94 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. రూ.6వేల కోట్ల విలువైన 189 కోట్ల ఉచిత బస్సు టికెట్లను ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని.. మొత్తం రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 95,351 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.