![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:11 PM
పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లి అక్కడ యజమాని దాడిలో గాయపడిన ఓ యువకుడు స్వదేశానికి రాగానే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన పెదవేణి రాజు (21) డిగ్రీ చదువుకుంటూ గ్రామంలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో మరింత మెరుగైన జీవనం కోసం సౌదీ వెళ్లాలని అనుకున్నాడు. అక్కడికి వెళ్లేందుకు కామారెడ్డికి చెందిన ఏజెంట్ రాజును సంప్రదించాడు. సౌదీలో డ్రైవింగ్ పనికోసం వీసా ఇప్పిస్తానంటే రాజు లక్ష రూపాయలు చెల్లించాడు. పది రోజుల క్రితం సౌదీ వెళ్లిన రాజుతో డ్రైవింగ్ పనికి బదులు గొర్రెలు మేపడం, ఎడారిలో కూలి పనులు చేయించారు. దీంతో రాజు యజమానిని ప్రశ్నించాడు. తాను వచ్చింది గొర్రెలు మేపడానికి, కూలి పనులకు కాదని, డ్రైవింగ్ కోసం వచ్చానని చెప్పాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. వారు తమ ఏజెంట్‌ను కలిసి తమ కుమారుడిని ఇంటికి రప్పించాలని కోరారు. రూ. 1.20 లక్షలు ఇస్తే రాజును తిరిగి స్వదేశానికి రప్పిస్తానని ఏజెంట్ చెప్పడంతో వారు విస్తుపోయారు.మరో దారిలేక అప్పుచేసి అడిగిన మొత్తం చెల్లించారు. దీంతో మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న రాజు తాండూరులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న రాజు ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. రాజు మృతిపై పోలీసులు స్పందిస్తూ.. రాజు సౌదీలో దాడికి గురైనట్టు ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఆధారాలు చూపలేదని, ఇస్తే కనుక చర్యలు తీసుకుంటామని తెలిపారు.