![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 11:07 PM
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ , వైఎస్ జగన్ వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఇవాల్టి రోజు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రజంటేషన్ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమ చేసేందుకు ఉమ్మడి కోటా నుంచి హైదరాబాద్ తాగునీరు జలాలను వేరు చేయాల్సి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా ఉండుంటే హైదరాబాద్‌కు తాగునీరు సాధించేవాళ్లమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీమాంధ్ర పాలకుల కంటే కేసీఆర్ వెయ్యి రెట్లు ద్రోహం చేశారని విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారని.. బేసిన్లు లేవు, భేషజాలు లేవంటూనే గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండని జగన్‌కు సలహా ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అసలు రాయలసీమను రతనాల సీమ చేస్తానని ప్రకటించేందుకు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతులకు కేసీఆర్ మరణ శాసనం చేశారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలోనే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందంటూ విమర్శించారు.
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన నేరానికి వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీ పది టీఎంసీలతో ప్రాజెక్టులు చేపడితే పాలమూరు - రంగారెడ్డి సామర్థ్యాన్ని ఒక టీఎంసీ తగ్గించారని విమర్శించారు. కృష్ణా జలాలను దారి దోపిడీ చేసే అవకాశం ఏపీకి ఆయనే ఇచ్చారన్నారు. కేసీఆర్ పాలనలో నిర్ణయాలు, తమ పాలనలో నిర్ణయాలపై చర్చకు సిద్ధం అంటూ సవాలు విసిరారు.
కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే చర్చ పెడదాం అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని.. తనకేమీ భేషజాలు లేవంటే చెప్పేశారు. కేసీఆర్ తనకంటే చాలా సీనియర్ అని.. ఫామ్ హౌస్‌కి తాను కూడా రావాలంటే వెళ్లి చర్చలో పాల్గొంటానన్నారు. మంత్రుల బృందాన్ని కూడా నేరుగా అక్కడికే పంపించి.. కేసీఆర్‌కు ఇబ్బంది లేకుండా అక్కడే చర్చిస్తామని సీఎం అన్నారు.