![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:52 PM
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒకరి మృతదేహాన్ని మరొకరి కుటుంబానికి అప్పగించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన వ్యక్తి బతికే ఉన్నాడని తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుటుంబ సభ్యుడిని బంధువులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50) బతుకుదెరువు కోసం ముంబై వెళ్లాడు. అక్కడే రమ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. అయితే, విభేదాల కారణంగా 20 ఏళ్ల కిందటే కుమారస్వామి, రమ విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత రమ మైలారంలో ఉంటుండగా, కుమారస్వామి తొర్రూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తొర్రూరులోని బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని స్థానికులు 108 సాయంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని కుమారస్వామిగా భావించిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని కుమారస్వామి బంధువులు స్వగ్రామానికి తరలించారు.అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మృతదేహం చేతికి పచ్చబొట్టు లేకపోవడం గమనించిన కుటుంబ సభ్యులు.. డెడ్ బాడీ కుమారస్వామిది కాదని గుర్తించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి ఎంజీఎంకు తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని వార్డులో చికిత్స పొందుతున్న కుమారస్వామిని ఆయన బంధువులు గుర్తుపట్టారు. చనిపోయాడనుకున్న కుమారస్వామి బతికే ఉన్నాడని తేలడంతో సంతోషం వ్యక్తం చేశారు.