|
|
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:52 PM
ఈ ఏడాది ఇప్పటి వరకు 15 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్.. మిగతా ఉద్యోగులకు కూడా హెచ్చరికలు జారీచేసింది. వారంతా ఏఐ (కృత్రిమ మేధ)లో నైపుణ్యం సాధిస్తేనే ఉద్యోగాలు ఉంటాయని, లేదంటే ఇంటికి పంపడం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ ఏడాది కనీసం నాలుగు రౌండ్ల శ్రామిక శక్తిని తగ్గించిన ఈ రెడ్‌మండ్ దిగ్గజం.. ఎక్స్‌బాక్స్, గేమింగ్ విభాగం, సేల్స్ బృందాలను ప్రభావితం చేసే తాజా రౌండ్‌లో దాదాపు 9 వేలమంది ఉద్యోగులను తగ్గించింది. అలాగే, మేలో 6 వేల మందిని, జూన్‌లో కొన్ని వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. మైక్రోసాఫ్ట్ డెవలపర్ డివిజన్ అధ్యక్షురాలు జూలియా లియుసన్ ఇటీవల మేనేజర్లకు కృత్రిమ మేధస్సు వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇకపై ఏఐ ఐచ్ఛికం కాదని, ప్రతి ఒక్కరు దానిని తప్పకుండా నేర్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏఐ నైపుణ్యాలను బట్టే మీ పనితీరును అంచనా వేస్తామని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కోపిలాట్, అజూర్ ఏఐ, గిట్‌హబ్ కోపిలాట్ వంటి టూల్స్ ఉపయోగించే సామర్థ్యం అవసరమని పేర్కొన్నారు.