![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 04:13 PM
నగరంలో నాలాల ఆక్రమణలను తొలగించడంపై హైడ్రా దృష్టి పెట్టింది. శుక్రవారం కూకట్‌పల్లి, ఖైరతాబాద్ పరిసరాల్లోని నాలాల ఆక్రమణలను తొలగించింది. నాలాల ఆక్రమణల వల్ల కాలనీలు, బస్తీలు నీట మునగకుండా చూడాలని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలసి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐడీఎల్ నాలాతో పాటు.. బుల్కాపూర్ నాలా ఆక్రమణలను తొలగించాలని ఆదేశించడంతో హైడ్రా రంగంలోకి దిగింది. శుక్రవారం ఈ రెండు నాలాల ఆక్రమణలను తొలగించే పనులు ప్రారంభించింది.
ఐడీఎల్ నాలా ఆక్రమణలు కూడా..
కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు నుంచి మొదలైన నాలా వెడల్పు 7 మీటర్లుండాల్సి ఉండగా.. చాలా చోట్ల 2 మీటర్లకే పరిమితమైంది. దీంతో హబీబ్‌నగర్, శ్రీహరినగర్, శివశక్తి నగర్ నీట మునగడం పరిపాటిగా మారింది. నడుం లోతు నీళ్లుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాలాకు ఆనుకుని ఆక్రమణలకు పాల్పడిన ఎన్ ఆర్ సీ, ఎన్‌కేఎన్ ఆర్ ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు 3 మీటర్లకు పైగా జరిపిన ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఈ రెండు ఫంక్షన్ హాళ్ల పొడుగునా 50 నుంచి 70 మీటర్లమేర ఆక్రమణలను తొలగించి వరద నీరు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంది. ఐడీఎల్ చెరువు నుంచి మొదలైన ఈ నాలా మూసాపేట మెట్రోస్టేషన్ దాటి కూకట్‌పల్లి నాలాలో కలుస్తుంది. ఇలా 2 కిలోమీటర్ల మేర పలుచోట్ల ఆక్రమణలను హైడ్రా తొలగించే పనులు ప్రారంభించింది. మూసాపేట మెట్రో స్టేషన్‌కు ఆనుకుని ఉన్న శివశక్తి నగర్ దగ్గర నాలా కేవలవం మీటరున్నరకు కుంచించుకుపోవడంతో అక్కడ ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంది.