![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 08:22 PM
తెలంగాణలో కొన్ని లక్షల మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. లబ్దిదారులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని నెలలు గడుస్తున్నా వాటి జారీపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈక్రమంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. మరో మూడు రోజుల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఆవివరాలు..
కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో మూడు రోజుల్లో అనగా జులై 14న కొత్తరేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలగిరిలో నూతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. జులై 14న 5 లక్షల నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లుగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల్లో అదనంగా చేరిన కుంటుంబ సభ్యులను కూడా చేర్చుతున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
ఈ నిర్ణయం ద్వారా తమ ప్రభుత్వం రాష్ట్రంలోని 3.10 కోట్ల మందికి ఉచితంగా 6 కేజీల సన్నబియ్యం ఇచ్చేందుకు గాను 13 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటం.. అలానే అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయడం తనకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చాయని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. పేదవారికి ఆహార భద్రత కల్పించే ఇలాంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడా లేవని అన్నారు. గత పాలకులు ఉప ఎన్నికలు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చారని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు..
జూలై 14 న.. వీరులకు పుట్టిల్లు, పోరాటాల పురిటి గడ్డ అయిన తుంగతుర్తి గడ్డ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రారంభింస్తారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కోరారు. అలానే తుంగతుర్తిని అభివృద్ధి చేసేందుకు తన వంతు సాయం తప్పకుండా చేస్తానని మంత్రి ఉత్తమ్ తెలిపారు.