![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 08:45 PM
రెండు కాలనీల మధ్య దూరాన్ని హైడ్రా తగ్గించింది. అడ్డు గోడను తొలగించి అనుసంధానం ఏర్పాటు చేసింది. హబ్సీగూడలో స్ట్రీట్ నంబరు 6 లోఉన్న అడ్డుగోడ తొలగడంతో నందనవనం, జయానగర్ కాలనీల మధ్య దూరం తగ్గింది. ఇప్పుడు నందనవనంలోని స్ట్రీట్ నంబరు 4 నుంచి నేరుగా 6లోకి వచ్చి హబ్సీగూడ ప్రధాన రహదారికి చేరుకుంటున్నారు. గురువారం ఉదయాన్నే స్ట్రీట్ నంబరు 6లో ఉన్న అడ్డుగోడను హైడ్రా తొలగించింది. ఈ అడ్డుగోడ తొలగడంతో కేవలం 300 మీటర్లు ప్రయాణించి ఎన్‌జీఆర్ ఐ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటున్నామని నందనవనం కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. లేదంటే ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణించి నానా అవస్థలు పడేవాళ్లమని.. ఇప్పుడా ఇబ్బంది తొలగించదన్నారు. 15 ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం... ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులను కలిసాం ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరకు జయానగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడినా జగడమే కాని.. సమస్య పరిష్కారం కాలేదు. ఇదే విషయమై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో వెంటనే పరిష్కారం దొరికిందని నందనవనంలోని కాంక్రేట్ ట్రంపెట్ అపార్టుమెంటు వాసులు చెబుతున్నారు.