![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:23 AM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన అమిటీ, సెంటినరీ రిహాబిలిటేషన్‌లకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని పొంగులేటి వివరించారు. ఈ వర్సిటీలలో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అన్నారు. 17 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని, మార్చి నాటికి లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయించామని తెలిపారు. ఇప్పటివరకు 19 కేబినెట్ సమావేశాలు నిర్వహించి, 321 అంశాలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది.