|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:55 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అన్ని విషయాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. కేసీఆర్ బహిరంగ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటారో తనకు తెలియదని, కానీ తాను మాత్రం ఆయనతో ఫుట్‌బాల్ ఆడుకుంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తనను ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కూడా కేటీఆర్ స్పందించారు. తాను ఫెయిల్యూర్ నాయకుడిని కాదని ఆయన అన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్‌లు, 136 మున్సిపాలిటీలను గెలిచామని గుర్తు చేశారు.అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు నిర్వహిస్తే అన్ని స్థానాల్లో ఓడిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సొంత పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించలేకపోయారని విమర్శించారు. తాను ఐరన్ లెగ్ కాదని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్‌లు అని ఆయన అన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విందులు, వినోదాలు ఎవరి ఇళ్లల్లో జరుగుతున్నాయో అందరికీ తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు.