|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 07:27 AM
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసులో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైని స్థానిక ఎమ్మెల్యే రక్షిస్తున్నారని ఆయన విమర్శించారు. కోదాడ పబ్లిక్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాజేశ్ మృతికి కారణమైన ఎస్సై సురేశ్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం వెనుక కుట్ర ఉందని మందకృష్ణ ఆరోపించారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఎస్సైపై చర్యలు తీసుకోవడం లేదని, ఇదే కేసులో బీసీ వర్గానికి చెందిన రూరల్ సీఐ ప్రతాప్ లింగంపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమని అన్నారు. మరియమ్మ లాకప్ డెత్ కేసు తరహాలోనే ఈ ఘటనలోనూ బాధ్యులైన వారందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.వెంటనే రాజేశ్ మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలని, ఎస్సై సురేశ్ రెడ్డిపై సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. నిందితుడిపై కేసు పెట్టని డీఎస్పీలు, ఎస్పీలను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ధర్నాలకు దిగుతామని ఆయన హెచ్చరించారు.