![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 12:32 PM
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేందుకు జరిగిన కుట్ర అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రం తన హక్కులను కోల్పోయిందని ఆయన విమర్శించారు. బుధవారం ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను గత పదేళ్లలో పూర్తి చేసి ఉంటే, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా దక్కేది. కానీ, గత ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది" అని అన్నారు. అంతేకాకుండా, 2016లో కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అపెక్స్ కౌన్సిల్‌కు గత ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలిపిందని ఆయన గుర్తు చేశారు.