![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 05:20 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం సంతోషకరమని, అయితే తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అందుకే ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే రిజర్వేషన్లను అమలు చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు ఎందుకు వేచి చూసిందని కవిత ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని తాము భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయని కవిత అన్నారు. విద్య, ఉద్యోగాల గురించి కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆమె డిమాండ్ చేశారు.