|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 06:56 PM
రెండున్నరేళ్లలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ పాలనలో అందరికీ న్యాయం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పరిస్థితి విచిత్రంగా ఉంది. భూములు విలువలు పడిపోయాయి. యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తోంది. పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెబుతున్నారు. ఐఏఎస్‌లు రాజకీయాలు మాట్లాడటం సరికాదు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఓట్లు ఉన్నప్పుడు కాదు.. నాట్లు వేసేటప్పుడు రైతుబంధు ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక ప్రభుత్వం రైతుబంధు నిలిపివేస్తుంది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలి. రేవంత్‌రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది. అందుకే ఢిల్లీ లో కూడా ఆయన్నే విమర్శిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పాలనలో జరిగిన మంచి పనులు కార్యకర్తలు చెప్పలేకపోయారు.. అందుకే ఓడిపోయాం. కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలి’’అని కేటీఆర్ అన్నారు.