|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 10:41 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కొడంగల్ నుండి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు ఈ రాఖీ కట్టామని వారు తెలిపారు.కొడంగల్ మండలం, లగచర్ల గ్రామం, రోటిబండ తండాకు చెందిన జ్యోతి, మరికొంతమంది మహిళలు ఈరోజు కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. లగచర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేశారని, ఆమె భర్తను జైలుకు పంపిన, సమయంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలు కమిషన్లకు ఫిర్యాదులు చేసి, జ్యోతితో పాటు లగచర్ల గిరిజనులకు, పేద రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఎండగట్టారు.
దీని ఫలితంగా, ప్రభుత్వం భూసేకరణను వెనక్కి తీసుకుందని వారు తెలిపారు. కేసుల కారణంగా జైలు పాలైన లగచర్ల సోదర సోదరీమణులందరికీ కేటీఆర్ ఒక అన్నగా అండగా నిలబడి, న్యాయ సహాయం అందించారని, అందరినీ జైలు నుంచి విడిపించారని వారు తెలియజేశారు.
రాఖీ కట్టిన సందర్భంగా జ్యోతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "ప్రభుత్వం మా భూములు లాక్కొని అన్ని వైపుల నుంచి దాడులు చేసి, మా కుటుంబ సభ్యులను జైల్లో పెడితే, నిండు గర్భిణిగా ఉన్న నాకు కేటీఆర్ అన్న అండగా నిలబడ్డారు. దగ్గరుండి నా బాగోగులు చూసుకున్నారు. నా ఆరోగ్యంతో పాటు నా ప్రసవం వరకు, నా బిడ్డ 'భూమి నాయక్' యోగక్షేమాల కోసం ఒక సొంత సోదరుడిలా అన్ని బాధ్యతలు తీసుకున్నారు" అని జ్యోతి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేటీఆర్ మేనమామలా తన బిడ్డకు పేరు పెట్టారని జ్యోతి సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ తనకు దేవుడు ఇచ్చిన సోదరుడని ఆమె అన్నారు. కేవలం తమకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన అన్నలా ఆదుకుంటారని, అలాంటి కేటీఆర్‌కు, ఈరోజు ఆయన ఇంటికి వచ్చి రాఖీ కట్టడం తమకు చాలా సంతోషంగా ఉందని జ్యోతి తెలిపింది.