|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 07:59 PM
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. క్యుములోనింబస్ మేఘాలతో ఆ జిల్లాలకు వర్ష సూచన (ఫోటోలు- Samayam Telugu)
తెలంగాణను వర్ష భయం వీడటం లేదు. ఉదయం పూట వాతావరణం బాగానే ఉంటున్నా.. సాయంత్రం, రాత్రి పూట వానలు దంచుతున్నాయి. ఇక మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ, మధ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల గురువారం రోజున కుండపోత వర్షాలు కురిసినట్లు వెల్లడించింది. ఇక ఇవే క్యుములోనింబస్ మేఘాల కారణంగా శుక్రవారం, శనివారాల్లో కూడా రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ, మధ్య తెలంగాణలోని జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
శుక్రవారం సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. సాయంత్రం 4 గంటల వరకు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వానలు పడే అవకాశముందని తెలిపింది. మరోవైపు.. ఈనెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈనెల 13, 14, 15వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక గురువారం ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి.. శుక్రవారం నాటికి మరింత బలపడింది. దీంతో హైదరాబాద్ నగరంలో వచ్చే 2 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావొద్దని సూచించారు.
మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వర్షం రాకముందే మూసుకుపోయిన నాలాలు, మ్యాన్ హోల్‌లను సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.