![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 12:45 PM
పటాన్చెరు : పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన అత్యంత దురదృష్టకరమని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో చర్చించి అతి త్వరలో విగ్రహాల పున ప్రతిష్టాపనతో పాటు, సీసీ కెమెరాలు, బలిపీఠం, ఆలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామ పుర ప్రముఖులు, పోలీసు అధికారులతో కలిసి ఆలయాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ సందర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం మతిస్థిమితం లేని వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తెలిసిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే గ్రామ పెద్దలతో పాటు. పోలీసులు అధికారులతో చర్చించి ఆవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సమయమనంతో వ్యవహరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పరమత సహనానికి పటాన్చెరు నియోజకవర్గం ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డిఎస్పి ప్రభాకర్, సిఐ వినాయక రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రుద్రారం పీఏసీఎస్ అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరిప్రసాద్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు.