![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 09:06 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్. మాధవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో కూడిన పటాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల పోరాటాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీని ఉద్దేశించి 'ఎక్స్' వేదికగా ఆయన స్పందించారు.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి చర్య తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని, చరిత్రను అవమానించే విధంగా ఉందని కేటీఆర్ అభివర్ణించారు. "మా సాంస్కృతిక గుర్తింపు, చారిత్రక స్థానం, భౌగోళిక ఉనికి కోసం తరతరాలుగా పోరాడి తెలంగాణను సాధించుకున్నాం. అలాంటిది మీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించి 'అఖండ ఆంధ్రప్రదేశ్' పటాన్ని బహూకరించడం మా పోరాటాన్ని కించపరచడమే" అని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తెలంగాణ ప్రజల పట్ల బీజేపీకి ఉన్న నిర్లక్ష్య వైఖరిని ఇది స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. "మా చరిత్రను చెరిపేస్తే మాకు అస్తిత్వం ఎక్కడ ఉంటుంది అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. ఇది మీ పార్టీ రాజకీయ ప్రణాళికలో భాగమా లేక అజెండానా అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇది పొరపాటున జరిగిన తప్పిదమైతే బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు