![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 10:11 PM
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), నగరవాసుల భద్రత, సురక్షితమైన రాకపోకలకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల స్కైవాక్‌లు అందుబాటులోకి రాగా.. హెచ్‌ఎండీఏ కమిషనర్ అహ్మద్ తాజాగా మరో నాలుగు నూతన పాదచారుల వంతెనల ఏర్పాటును ప్రకటించారు. ఇది నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రో రైల్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్లు, రేతిఫైల్, కీస్ హైస్కూల్ బస్టాప్‌లను అనుసంధానిస్తూ ఒక సమగ్ర స్కైవాక్ నిర్మాణం జరగనుంది. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో, పాదచారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంతే కాకుండా.. ఈ ఏరియాల్లోని విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
కూకట్‌పల్లి జేఎన్టీయూ ప్రాంతం:
జేఎన్టీయూ నుంచి మెట్రో స్టేషన్ వరకు, అలాగే జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్ మార్గంలో ప్రయాణించే వారికి మరో స్కైవాక్ నిర్మించనున్నారు. ఇది విద్యార్థులు, ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
ఉప్పల్ జంక్షన్:
ఉప్పల్ జంక్షన్ వద్ద.. ఉప్పల్ వైపు వెళ్లే మార్గంలో శ్మశానవాటిక ఉండటం వల్ల గతంలో స్కైవాక్ ఏర్పాటుకు సాధ్యపడలేదు. అయితే.. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో.. ఇక్కడ కూడా స్కైవాక్ ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఏరియాలో ఒక స్కై వాక్ నిర్మించిన విషయం తెలిసిందే.
మెహిదీపట్నం స్కైవాక్ ప్రారంభం..
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మెహిదీపట్నం స్కైవాక్‌ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు కమిషనర్ అహ్మద్ ప్రకటించారు. ఇది నగరంలో ఒక ప్రధానమైన స్కైవాక్‌గా నిలవనుంది. ఆదాయ వనరులను పెంపొందించుకోవడానికి.. హెచ్‌ఎండీఏ కొత్తగా కంది, ఫసల్ వాడీ, పెద్ద కంజర్లలో లేఅవుట్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరించి, పెద్ద ఎత్తున లేఅవుట్‌లను రూపొందించాలని భావిస్తున్నట్లు కమిషనర్ అహ్మద్ తెలిపారు. ఇది నగర అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అంచనా.
మాస్టర్ ప్లాన్ 2050 పురోగతి.. పెండింగ్ ఫైల్స్ స్పష్టీకరణ
హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 పనులు 2026 మే నాటికి పూర్తవుతాయని కమిషనర్ వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఎకానమిక్ డెవలప్‌మెంట్ ప్లాన్, బ్లూ, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్‌లు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్‌లకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయనే ప్రచారం అవాస్తవమని కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని పనులు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా, హెచ్‌ఎండీఏ పరిధిలో 19 కొత్త పార్కులను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించినట్లు కమిషనర్ అహ్మద్ వెల్లడించారు. ఇది నగరంలో పచ్చదనం పెంపుదలకు, పౌరులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడానికి దోహదపడుతుంది.