|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 10:17 PM

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన ఆషాఢ బోనాలు, నగరంలోని ఐటీ కారిడార్‌ను కూడా భక్తి పారవశ్యంలో ముంచెత్తనున్నాయి. తెలంగాణ సమాజానికి, సంప్రదాయాలకు ఆధునికతను జోడిస్తూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీహబ్ వేదికగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) బోనాలు 2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడానికి టీటా చేస్తున్న కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ ఏడాది ఐటీ బోనాల వేడుకలను జూలై 6న, ఆషాఢ మాసం రెండో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో దాదాపు 21 ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పాల్గొననున్నారు. అంటే 1500 మంది ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ భాగస్వామ్యంలో ఈ వేడుకలు జరగడం విశేషం. టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు సంస్కృతి పరిరక్షణలో అందిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఐటీ బోనాల్లో పాల్గొన్న అనుభవాలను గుర్తు చేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు, వాతావరణంలో సంప్రదాయాన్ని నిలిపే ఈ వేడుకలు ఎంతో గొప్పవని, టీటా ద్వారా ఈ సంస్కృతి ఆధారిత కదలిక ఐటీ కారిడార్‌లో నిలబెట్టడం అభినందనీయమని ప్రశంసించారు. ఇది సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక జీవనశైలితో సమ్మిళితం చేసే ఒక అద్భుతమైన ప్రయత్నం.
ఈ సంవత్సరం వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా.. శిల్పకళా వేదిక నుంచి చిన్న పెద్దమ్మ దేవస్థానానికి భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఊరేగింపు ప్రారంభానికి ముందు, సందీప్ మక్తాలా కుటుంబం అమ్మవారికి చీర సారెలతో, ఒడి బియ్యాన్ని సమర్పించి ప్రత్యేక సంప్రదాయ పూజ నిర్వహిస్తారు. ఇన్ఫోసిస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ ఐటీ కంపెనీల నుండి వచ్చిన 21 బోనాలు, తమ కార్యాలయాల నుండి బయలుదేరి శిల్పకళా వేదిక వద్ద కలుస్తాయి. అక్కడి నుండి ఊరేగింపుగా చిన్న పెద్దమ్మ దేవస్థానానికి భక్తిశ్రద్ధలతో సాగుతాయి.
ఈ ప్రదర్శనలో భక్తితో పాటు సంగీతం, సంప్రదాయం, ఐక్యత నిండి ఉంటాయి. పోతురాజులు, శివసత్తులు, డప్పులు, ఒగ్గు డోలు, గుస్సాడి తదితర ప్రజాకళల బృందాలు సాంప్రదాయ ప్రదర్శనలు ఇస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ జానపద కళలకు అంతర్జాతీయ ఐటీ వేదికపై గుర్తింపు లభిస్తుంది.