![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 08:58 PM
గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ (GHMC) నుంచి సరైన అనుమతులు లేవని హైడ్రా అధికారులు అప్పట్లో తెలిపారు. దాదాపు 3.30 ఎకరాలకు పైగా చెరువు భూమిని ఆక్రమించారని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో ఈ విషయం ప్రస్తావించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నటుడు నాగార్జున చెరువులు అభివృద్ధి చేయడానికి రెండెకరాల భూమి ఇచ్చారని, నగర అభివృద్ధిలో తాను కూడా ఒక హీరోలా ఉండాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారని సీఎం వెల్లడించారు.
శేరిలింగంపల్లిలోని శిల్పా లే అవుట్ ఫేస్-2 వద్ద నిర్మించిన కొత్త ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (జూన్ 28న) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. "గతంలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను ప్రభుత్వం కూల్చివేసింది. ఆ తర్వాత వారే స్వయంగా ముందుకు వచ్చి, అక్కడ రెండెకరాలు చెరువు అభివృద్ధికి ఇచ్చారు. ఆయనే స్వయంగా నా దగ్గరికి వచ్చి అప్పగించారు. నగర అభివృద్ధిలో నేనొక హీరోలా ముందుంటా అని చెప్పారు. మీరు ఒక సంకల్పం తోటి ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నారు అని నాగార్జున అన్నారు." అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల హైదారాబాద్ హైటెక్ సిటీ అభివృద్ధి చెందిందని సీఎం రేంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి దీనివల్లనే రాష్ట్రానికి అత్యధిక పన్నులు వసూలవుతున్నాయన్నారు. "ఒకప్పుడు హైటెక్ సీటీ, సైబరాబాద్ ప్రాంతాల్ని చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వంటి వారు అభివృద్ధి చేస్తామంటే అందరూ నవ్వారు. ఇది అయ్యేదేనా, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు పూర్తి అయ్యేదేనా అని అన్నారు. కానీ ఈరోజు మీరు ఈ అభివృద్ధిని కళ్లారా చూస్తున్నారు" అని సీఎం అన్నారు.
"హైటెక్ సిటీ చూశారు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు చూశారు. గచ్చిబౌలి చౌరస్తా చూశారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే ఆరు గంటల తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఈయ్యాల నగరమే ఇక్కడ ఉంది. అక్కడున్న నగరం 9 గంటల తర్వాత నిద్రపోతోంది. ఈ కొత్త నగరం 24 గంటలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోని తళతళ మెరుస్తోంది. ఈ ప్రాంతం కలకలలాడుతోంది. ఇక్కడి నుంచే అత్యధికంగా రాష్ట్రానికి పన్నులు వసూల్ అవుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.