|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 05:50 PM

ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలతో అక్రమ కేసులు పెడితే భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయులై ఉండాలని, రాజకీయ నాయకులకు బానిసలు కాకూడదని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
‘ఏ కర్మ అయితే మనం ఇక్కడ చేస్తామో, ఆ ఫలితాన్ని కూడా మనమే ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది’ ఈ మాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐపీఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేసిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో పోలీసులు, అధికారుల తీరుపై ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలతో పోలీసులు నిర్దోషులపై అక్రమ కేసులు పెట్టి, వారిని రాజకీయంగా వేధిస్తే, అది వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకున్నట్లేనని దాసోజ్ శ్రవణ్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేస్తూ డీజీపీకి లేఖ పంపారు. వ్యక్తిగత కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఎలాంటి ఒత్తిళ్లూ లేవని ఆయన స్పష్టం చేసినప్పటికీ.. ఈ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేసిన కౌశల్, రాజీనామా చేసే సమయానికి డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్నారు. అయితే, దాసోజ్ శ్రవణ్ మాత్రం ఈ రాజీనామాను రాజకీయ ఒత్తిళ్ల ఫలితంగానే చూస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చర్యలు భవిష్యత్తులో ఏర్పడే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక మార్గాన్ని చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
హెచ్చరికల వెనుక కారణాలు..
దాసోజ్ శ్రవణ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం, తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు, కార్యకర్తలపై జరుగుతున్న ‘వేధింపులు’. ముఖ్యంగా.. టీ న్యూస్ కార్యాలయంలో పోలీసుల విచారణ వీడియోలు సీఎం ఛానెల్‌కు ఎలా లీక్ అయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఇది చట్టబద్ధమైన చర్య కాదని, రాజకీయ కుతంత్రానికి సంకేతమని దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. సీఎం చెప్పాడని.. మంత్రి ఆదేశించాడని అరాచకం సృష్టిస్తే, మూడేళ్ల తర్వాత అదే అధికారులు, పోలీసులు కూడా రాజీనామా చేసే దుస్థితి వస్తుందన్నారు.
పోలీసులు, అధికారులు రాజ్యాంగానికి మాత్రమే విధేయులు కావాలి కానీ, ఏ రాజకీయ నాయకుడికి లేదా పార్టీకి బానిసలు కారు అని దాసోజ్ శ్రవణ్ పునరుద్ఘాటించారు. బ్లూ బుక్, సర్వీస్ కండక్ట్ రూల్స్ వంటివి చట్టపరంగా వారి రక్షణ కోసమే రూపొందించబడ్డాయని, అవి ప్రజాసేవకులుగా వారి పాత్రను నిబద్ధతతో నిర్వహించడానికి ఉద్దేశించినవని ఆయన గుర్తుచేశారు. ఈ నియమాలను తుంగలో తొక్కి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే, అందుకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. బాధ్యతతో, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. లేకపోతే.. ప్రస్తుతం ఇతరుల చరిత్రలో చూస్తున్న దుర్మార్గ గాథలు రేపు వారి పేర్లతోనే నిలిచిపోతాయని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.