![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:25 PM
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన రాజకీయ ప్రయాణం, పార్టీ పరిస్థితులు, కుటుంబం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పటికైనా సీఎం అవుతానని ఆమె వ్యాఖ్యానించారు. అది చేరుకోవడానికి పది ఏళ్లు పట్టొచ్చు.. ఇరవై ఏళ్లు పట్టొచ్చు అని తెలిపారు. కొత్త పార్టీ?.. అంతే కాకుండా తనకు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, బీఆర్ఎస్ తన పార్టీ అని తెలిపారు. తన భవిష్యత్తు బీఆర్ఎస్‌తోనే అనుబంధంగా ఉంటుందని తెలిపారు. అయితే, పార్టీకి లోపల చోటు చేసుకున్న ఆంతరంగిక అసంతృప్తి విషయాలను కూడా ఆమె ఓపెన్ గానే చర్చించారు. బీఆర్ఎస్‌ను తినేస్తున్న కొందరు దెయ్యాలు ఉన్నాయని.. పార్టీ వ్యవస్థను లోపలి నుంచే పాడుచేస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారిని పార్టీలో కొనసాగిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు లేఖ, కేటీఆర్‌తో పొలిటికల్ గ్యాప్? తన తండ్రి కేసీఆర్‌కు రాసిన ఓ లేఖ మీడియాకు లీక్ ఎలా అయ్యిందో తెలియదన్నారు కవిత. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ వంటి వ్యక్తి అలాంటి పనులకు పాల్పడడని, కింది స్థాయి అధికారులు స్వయంగా చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తన సోదరుడు కేటీఆర్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవని.. రాజకీయంగా మాత్రం లేఖ లీక్ అయిన దగ్గర నుంచి కొంత గ్యాప్ వచ్చిందని అంగీకరించారు. నిజామాబాద్ ఓటమి వెనుక పార్టీ నేతలే? 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి సొంత పార్టీ నేతలే బాధ్యత వహించారని కవిత ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాం విషయంలో అరెస్ట్ అయిన సందర్భాలను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. కష్ట సమయంలో పార్టీ తనను ఒంటరిగా వదిలేసిందని ఆరోపించారు. వేధింపుల సమయంలోనూ పార్టీ పెద్దలు తనకు నిలబడి మద్దతివ్వకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా.. తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే తన స్వగత నియోజకవర్గంగా భావించే ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ, బలమైన కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన సామాజిక సేవా సంస్థ 'తెలంగాణ జాగృతి'ను మళ్లీ ఉజ్వలంగా ముమ్మరంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా హీట్ రాజేస్తున్నాయి. ముఖ్యమంత్రి అవ్వడమే తన లక్ష్యంఅంటూ చెప్పడం.. తెలంగాణ రాజకీయాలను మరో కొత్త మలుపు తిప్పడం ఖాయమంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.