|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:57 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) తీవ్రమైన సీజనల్ జ్వరం బారిన పడటంతో ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న యశోద ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రత్యేక వైద్య బృందం సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. కేసీఆర్ అనారోగ్యంపై ఆయన శ్రేయోభిలాషులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ వెంట అతని భార్య శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ వెళ్లారు.
కేసీఆర్‌కు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో కూడా కేసీఆర్ పలుమార్లు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. కొన్ని నెలల క్రితం ఆయన తుంటి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు. అలాంటి సమయంలో జ్వరం బారిన పడటం తమ కుటుంబసభ్యులను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది.
మానసిక ఒత్తిడే కారణమా..?
తెలంగాణలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ ప్రజల్లో అంతగా కనిపించడం లేదు. ఈ మార్పు ఆయన ఆరోగ్యం, ముఖ్యంగా మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన గతంలో ప్రదర్శించిన ఉత్సాహం, దూకుడు కనిపించకపోవడం పార్టీ కార్యకర్తలను కూడా నిరుత్సాహపరిచింది. ఇది కేవలం శారీరక అనారోగ్యం వల్లనే కాదు.. రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వంటివి ఆయన మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావం చూపాయని తెలుస్తోంది.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్లు ఆరోపించబడుతున్న ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. పలువురు ఉన్నతాధికారులు అరెస్టవడం, విచారణలు కొనసాగడం వంటివి కేసీఆర్, ఆయన పార్టీకి తీవ్ర ప్రతికూలతను సృష్టించాయి. ఈ పరిణామాలు కేసీఆర్ మానసిక స్థితిపై తీవ్ర ఒత్తిడిని కలిగించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను నమ్మిన అధికారులు, తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు అరెస్ట్ అవ్వడం, మీడియాలో నిత్యం ఈ వ్యవహారంపై చర్చ జరగడం వంటివి ఆయనను కలవరపెట్టి ఉండవచ్చు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి, ఇలాంటి ఆరోపణలు, పరువు నష్టం కచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.