![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 09:06 PM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సంచలన ఆరోపణలు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే నేడు కొండా మురళి గాంధీ భవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవిని కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీలోని విబేధాలు, జరుగుతోన్న తాజా పరిణామాలపై క్రమశిక్షణ కమిటీకి మొత్తం ఆరు పేజీలతో కూడిన లేఖను అందజేశారు.
అనంతరం గాంధీభవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే.. ఏ జిల్లాలో లేని విధంగా వరంగల్ జిల్లాలో మాత్రమే రెండు స్థానాలు రిజర్వు అయ్యాయని.. అందుకోసం తాను తీవ్రంగా కృషి చేశానని తెలిపారు. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి కూడా తానేనని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకునే వ్యక్తి తానే అన్నారు కొండామురళి. అలానే కాంగ్రెస్ పెద్దలంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. తనను ఎవరూ ప్రశ్నించలేదని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేసే పనిలో తాను నిత్యం బిజీగా ఉంటానని కొండా మురళి చెప్పుకొచ్చారు. అలానే తనను రెచ్చగొట్టొద్దని.. తాను మృత్యువుకు కూడా భయపడనని చెప్పుకొచ్చారు. తన బలమేంటో భారతదేశంలో అందరికీ తెలుసని.. తన శరీరంలో ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు.. తాను రాజీనామా చేసి వచ్చానని కొండా మురళి గుర్తు చేశారు. అది తన నిబద్ధత అని.. ఆయన స్పష్టం చేశారు. అలానే ప్రస్తుతం ఉన్న కొంత మంది నాయకుల మాదిరిగా తాను పార్టీ మారినా పదవిలో కొనసాగలేదని తెలిపారు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగాగెలిచిన వ్యక్తి తానేనని..ఈ విషయం అందరికీ తెలుసన్నారు. అలానే తనను ఎవరూ పిలిచి.. ఈ విషయాలు వివరించమని చెప్పలేదని.. తానే పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ మీద అభిమానంతో వచ్చి వివరించానని చెప్పుకొచ్చారు.