|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:37 PM
మలయాళం నుంచి థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలు .. సిరీస్ లు ఎక్కువగా వస్తుంటాయి. థ్రిల్లర్ జోనర్ ను రసవత్తరంగా నడిపించడంలో వాళ్లకి మంచి పట్టు ఉందనే విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే అందుకు భిన్నంగా ఈ సారి మలయాళం నుంచి, 'సర్వం మాయ' అనే ఒక సూపర్ నేచురల్ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రితం ఏడాది డిసెంబర్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీ నుంచి వివిధ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.అది కేరళలోని ఒక విలేజ్. అక్కడ నీలకంఠ నంబూద్రికి మంచి పేరు ఉంటుంది. ఆయన 70వ జన్మదిన వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాలలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఇతర బంధువులంతా ఆ గ్రామానికి చేరుకుంటూ ఉంటారు. నీలకంఠ నంబూద్రి చిన్న కొడుకు ప్రభేందు (నివీన్ పౌలి)కూడా ఆ విలేజ్ కి చేరుకుంటాడు. తండ్రితో చాలాకాలంగా మాటలు లేకపోవడం వలన, ఆయనకి దూరంగానే ఉంటూ ఉంటాడు. ప్రభేందును అందరూ 'ప్రభ' అనే పిలుస్తూ ఉంటారు. అతను మంచి గిటారిస్ట్. కొన్ని సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయనకి ఉంది.ఇతర దేశాలలో 'ప్రభ' స్టేజ్ షోలు చేస్తూ ఉంటాడు. అయితే 'వీసా' రాని కారణంగానే ఆయన తండ్రి పుట్టినరోజు కార్యక్రమానికి సొంత ఊరు చేరుకుంటాడు. తమ వంశీకులంతా పౌరోహిత్యాన్ని నమ్ముకుని గౌరవంగా బ్రతుకుతూ ఉంటే, ప్రభ ఊళ్లు పట్టుకు తిరగడం తండ్రికి నచ్చదు. మ్యూజిక్ వైపు నుంచి తనకి సక్సెస్ వచ్చే వరకూ, పౌరోహిత్యం చేయాలని ప్రభ నిర్ణయించుకుంటాడు. వరుసకు బావ అయిన రూపేశ్ (అజూ వర్గీస్) దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. ఒకసారి రూపేశ్ గాయపడటం వలన, ఒక తాంత్రిక పూజ చేయడానికి ప్రభ ఒక ఇంటికి వెళ్లవలసి వస్తుంది. తాంత్రికం గురించి ఏమీ తెలియకపోయినా డబ్బు కోసం ప్రభ వెళతాడు. ఆ ఇంట్లోని అవినాశ్ అనే కుర్రాడికి దెయ్యం పట్టిందని తెలిసి, భయపడుతూనే పూజ చేస్తాడు. అయితే ఆ క్షణంలోనే ఆ కుర్రాడిని ఆ దెయ్యం వదిలేస్తుంది. ఎందుకు వదిలేసింది అనేది ప్రభకి అర్థం కాదు. అయితే ఆ రోజు రాత్రి ప్రభ గదిలో ఏదో అలికిడి అవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన, ఎదురుగా అందమైన అమ్మాయిగా కనిపిస్తున్న దెయ్యాన్ని చూసి భయపడిపోతాడు. అవినాశ్ ను వదిలేసిన దెయ్యం తనతో పాటు వచ్చేసిందనే విషయం అతనికి అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు దెయ్యంగా మారింది? ప్రభ వెంటనే ఆమె ఎందుకు తిరుగుతూ ఉంటుంది? ప్రభకి తప్ప ఆమె ఎవరికి ఎందుకు కనిపించదు? అనేది మిగతా కథ.
Latest News