|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:17 AM
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, అప్పటి వరకూ ఏ సీనియర్ కు దక్కని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' ఆ రికార్డును తిరగరాసింది.ఇదిలా ఉంటే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీని హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయబోతున్నట్టు గత నవంబర్ లో ఇఫీ వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ తెలిపారు. అయితే ఇప్పుడు అందులో హీరోయిన్ల ఎంపిక తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. తెలుగులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. ఇప్పుడీ పాత్రను హిందీలో విద్యాబాలన్ (Vidya Balan) తో చేయించబోతున్నట్టు తెలిసింది. అలానే వెంకటేశ్ మాజీ ప్రియురాలి పాత్రను మీనాక్షి చౌదరి పోషించింది. ఆ క్యారెక్టర్ ను హిందీలో రాశీ ఖన్నాతో చేయించబోతున్నారట. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, రాశీ ఖన్నా కాంబినేషన్ అనగానే సహజంగా బాలీవుడ్ వర్గాలలో సూపర్ క్రేజ్ నెలకొంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.
Latest News